Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 15

Deva's prayers to MahaVishnu

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

బాలకాండ
పదునైదవ సర్గము
( రావణ సంహారమునకు విష్ణువును దేవతలు ప్రార్థించుట )

మేధావీతు తతో ధ్యాత్వా స కించిదిదముత్తరమ్ |
లబ్ధ సంజ్ఞః తతస్తం తు వేదజ్ఞో నృపమబ్రవీత్ ||

తా|| ఆ మేధావి అయిన ఋష్యశృంగుడు తను ఇచ్చిన మాట పిమ్మట క్షణమాలోచించి పిమ్మట కర్త్వ్యము స్ఫురింపగా ఆ వేదజ్ఞుడు మహారాజునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను.

ఇష్టిం తేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ |
అధర్వ శిరసి ప్రోక్తైః మంత్రై స్సిద్ధామ్ విధానతః ||
తతః ప్రాక్రమదిష్టిం తాం పుత్రీయాం పుత్రకారణాత్ |
జుహావ చాగ్నౌ తేజస్వీ మంత్రదృష్టేన కర్మణా ||
తతో దేవా స్సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః |
భాగ ప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి ||

తా|| "ఓ రాజా! నీకు పుత్త్రులు కలుగుటకు అధర్వ సిరస్సు వేదభాగమందు పేర్కొనబడిన మంత్రములతో విధియుక్తముగా 'పుత్త్రకామేష్టి' అను క్రతువును నిర్వహించెదను". అనంతరము ఆ ఋషి "పుత్త్రకామేష్టి" యాగమును ప్రాంభించెను. ఆ తేజోమయుడు వేదమంత్రములు పఠించుచూ అగ్నికి ఆహుతులు సమర్పించెను. ఆప్పుడు బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు తమతమ హవిర్భాగములు గ్రహించుటకై యథాక్రమముగా యజ్ఞశాలయందు ప్రత్యక్షమైరి.

తాస్సమేత్య యథాన్యాయం తస్మిన్ సదసి దేవతాః |
అబ్రువన్ లోకకర్తారం బ్రహ్మణం వచనం మహత్ ||

తా|| దేవతలందరూ క్రమముగా సదస్సునకు చేరి సృష్టికర్త అయిన బ్రహ్మతో ఇట్లు విన్నవించుకొనిరి.

భగవన్ త్వత్ప్రసాదేన రావణోనామా రాక్షసః |
సర్వాన్ నో బాధతే వీర్యాత్ శాసితుం తం న శక్నుమః ||
త్వయా తస్మై వరో దత్తః ప్రీతేన భగవన్ పురా |
మానయంతశ్చ తం నిత్యం సర్వం తస్య క్షమామహే ||
ఉద్వేజయతి లోకాం స్త్రీన్ ఉచ్ఛ్రితాన్ ద్వేష్టి దుర్మతిః |
శక్రం త్రిదశరాజానం ప్రధర్షయితుమిచ్ఛతి ||
ఋషీన్ యక్షాన్ సగంధర్వాన్ అసురాన్ బ్రాహ్మణాం స్తథా |
అతిక్రామతి దుర్ధర్షో వరదానేన మోహితః ||

తా|| ఓ దేవా నీ అనుగ్రహము చేత రావణుడు అను రాక్షసుడు తన పరాక్రమముచే అందరినీ చిత్రహింసలు చేయుచున్నాడు. వానిని శాసించుటకు మేము అశక్తులము. భగవన్ ! పూర్వము అతని తపస్సునకు మెచ్చి నీవు ఆయనకు వరమొసగితివి. దానిని గౌరవించుచూ మేము నిత్యమూ అతని సర్వకార్యములను సహించుచున్నాము. ఆ దుర్మతి గర్వముతో ముల్లోకములను బాధించుచున్నాడు. ఉన్నతులను ద్వేషించుచున్నాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని రాజ్యభ్రష్ఠుని గావింపచూచుచున్నాడు. ఋషులు యక్షులు గంధర్వులు అసురులు , బ్రాహ్మణులను వరదానము వలన గర్వముతో హింసించుచున్నాడు.

నైనం సూర్యః ప్రతపతి పార్స్వేవాతి న మారుతః |
చలోర్మి మాలీ తం దృష్ట్వా సముద్రోపి న కంపతే ||
తన్మహన్నో భయం తస్మాత్ రాక్షసాద్ఘోరదర్శనాత్ |
వధార్థం తస్య భగవన్నుపాయం కర్తుమర్హసి ||

తా|| (అతనిలి భయపడి) సూర్యుడు తన కిరణములవేడి తగ్గించుచున్నాడు. వాయువు వీచుటలేదు. ఉవ్వెత్తు తరంగములతో నుండు సాగరము కంపించుటలేదు. మహాత్మా ! అందువలన భయంకరాకారుడైన ఆ రాక్షసుని భయపడుచున్నాము. కావున వానిని వధింపు ఉపాయము మీరే ఆలోచించుడు.

ఏవముక్త స్సురైస్సర్వైః చింతయిత్వా తతోsబ్రవీత్ |
హంతాయం విదితస్తస్య వధోపాయో దురాత్మనః ||
తేన గంధర్వ యక్షాణాం దేవ దానవ రక్షసామ్ |
అవధ్యోsస్మీతి వాగుక్తా తథేత్యుక్తం చ తన్మయా ||
నాకీర్తయదవజ్ఞానాత్ తద్రక్షో మానుషాం స్తదా |
తస్మాత్ స మానుషాద్వధ్యో మృత్యుర్నాన్యోsస్య విద్యతే ||

తా|| దేవతలందరూ ఇట్లు చెప్పగా బ్రహ్మదేవుడు క్షణమాలోచించి ," ఆ దురాత్ముని వధించుటకు ఉపాయము స్ఫురించినది. గంధర్వులచే గాని యక్షులచేగాని దేవతలచేగాని దానవులచే గాని రాక్షసులచే గాని నాకు మరణము లేకుండునట్లు వరమిమ్ము" అని రావణుడు కోరెను. నేను "అట్లే" అని అంటిని. అజ్ఞానమువలన మానుషలనుంచి రక్షణ కోరలేదు.కావున మనవుని చేతిలో అతని మరణము సంభవము . ఇతరుల వలన కాదు."

ఏతచ్ఛ్రుత్వా ప్రియం వాక్యం బ్రహ్మణా సముదాహృతమ్ |
సర్వే మహర్షయో దేవాః ప్రహృష్టా స్తేsభవం స్తదా ||
ఏతస్మిన్నంతరే విష్ణుః ఉపయాతో మహాద్యుతిః |
శంఖచక్రగదాపాణిః పీతవాసా జగత్పతిః ||
బ్రహ్మణా చ సమాగమ్య తత్ర తస్థౌ సమాహితః |
తమబ్రువన్ సురాః సర్వే సమభిష్టూయ సన్నతాః ||

తా|| బ్రహ్మదేవుడు పలికిన ప్రీతికరమైన మాటలను విని దేవతులు మహర్షులు అందరునూ ఆనందముతో ఉప్పొంగిపోయిరి. అంతట జగత్పతి అయిన మహావిష్ణువు శంఖ చక్ర గదాపాణి అయి పీతాంబరధారి అయి దివ్య తేజస్సుతో విరాజిల్లుచూ యజ్ఞశాలకు అరుదెంచెను. అంతట మహావిష్ణువు బ్రహ్మతో గూడి అచట ఉపస్థితుడాయెను. అప్పుడు దేవతలందరూ ఆ దేవదేవుని సంస్తుతించి సాగిలబడి ఇట్లు ప్రార్థించిరి.

త్వాం నియోక్ష్యామహే విష్ణో లోకానాం హితకామ్యయా |
రాజ్ఞో దశరథస్య త్వం అయోధ్యాధిపతేః ప్రభో ||
ధర్మజ్ఞస్య వదానస్య మహర్షి సమతేజసః |
తస్య భార్యాసు తిసృషు హ్రీశ్రీ క్రీర్త్యుపమాసు చ ||
విష్ణోపుత్త్రత్వ మాగచ్ఛ కృత్వాత్మానం చతుర్విథం |
తత్ర త్వం మానుషోభూత్వా ప్రవృద్ధం లోకకంటకమ్ |
అవధ్యం దైవతై ర్విష్ణో సమరే జహి రావణమ్ ||

తా|| "ఓ మహావిష్ణూ ! లోకహితము కోరి మేము నిన్నువేడుకొనుచున్నాము. అయోధ్యాధిపతి అయిన దశరథమహారాజు సర్వ సమర్థుడు ధర్మజ్ఞుడు, ఉదారస్వభావుడు , మహర్షులతో సమాన్మైన తేజస్సు గలవాడు. అతని ముగ్గురు భార్యలు హ్రీ శ్రీ కీర్తి అను వారితో సమానులు. వారికి నాలుగురూపములలో పుత్త్రుడవు కమ్ము. అచట నీవు మానుషరూపము ధరించి , దేవతలకు అవధ్యుడైన ఆ రావణుని సమరములో హతమొనర్చుము."

స హి దేవాశ్చ గంధర్వాన్ సిద్ధాంశ్చ మునిసత్తామాన్ |
రాక్షసో రావణో మూర్ఖో వీర్యోత్సేకేన భాధతే ||
ఋషయశ్చ తతస్తేన గంధర్వాప్సరసస్తథా |
క్రీడంతో నందనవనే క్రూరేణ కిల హింసితాః ||

తా|| మూర్ఖుడైన ఆ రాక్షస రావణుడు పరాక్రమగర్వముతో దేవతలను , గంధర్వులను, సిద్ధులను , మునిసత్తములను బాధించుచున్నాడు.ఆ క్రూరుడు ఋషులను అట్లే నందనవనమున విహరించు గంధర్వులను అప్సరలను హింసించుచున్నాడు.

వదార్థం వయమాయాతాః తస్య వై మునిభిః సహ |
సిద్ధగంధర్వయక్షాశ్చ తత స్త్యాం శరణం గతా: ||
త్వం గతిః పరమా దేవ సర్వేషాం నః పరంతప |
వధాయ దేవశత్రూణాం నృణాం లోకే మనః కురు ||

తా|| సిద్ధ గంధర్వ యక్షులతో మునులతో గూడి మేము రావణ వధ కొఱకు ఇచటికి వచ్చి మిమ్ము శరణు కోరుచున్నాము. ఓ మహావిష్ణూ మా అందరికీ నీవే గతి. దేవతలకు శత్రువైన రాక్షసులను వధించుటకు మానవుడై అవతరించుటకు సంకల్పింపుము.

ఏవముక్తస్తు దేవేశో విష్ణుస్త్రిదశపుంగవః |
పితామహాపురోగాం స్తాన్ సర్వలోక నమస్కృతః |
అబ్రవీత్ త్రిదశాన్ సర్వాన్ సమేతాన్ ధర్మ సంహితాన్ ||

తా|| బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా సకలలోకా ఆరాధ్యుడు దేవ దేవుడు అయిన శ్రీ మహావిష్ణువు తనను శరణుజొచ్చిన బ్రహ్మాది దేవతలతో ఇట్లు నుడివెను

భయం త్యజత భద్రం వో హితార్థం యుధి రావణమ్ |
సపుత్రపౌత్రం సామాత్యం సమిత్ర జ్ఞాతి బాంధవమ్ |
హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహమ్ ||
దశ వర్ష సహస్రాణి దశవర్షశతాని చ |
వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీ మిమామ్ ||

తా|| " భ్హయమును వీడుడు. మీకు భద్రత చేకూరును. క్రూరుడు దురాత్ముడు దేవర్షులను భాధించుచున్న వాడు అగు రావణుని అతని పుత్త్రులను, పౌత్రులను , అమాత్యులను , బంధువులను, మిత్రులను జ్ఞాతులను లోకహితార్థమై హతమార్చెదను.. పిమ్మట పదివేలసంవత్సరములు ఆ తరువాత పది వాందలసంవత్సరములు ఆ మానవలోకమున నివశించి ఆ భూమండలము పాలించెదను"'

ఏవమ్ దత్త్వా వరం దేవో దేవానాం విష్ణు రాత్మవాన్ |
మానుషే చింతయామాస జన్మభూమిమ్ అథాత్మనః ||
తతః పద్మ పలాశాక్షః కృత్వాత్మానం చతుర్విథమ్ |
పితరం రోచయామాస తదా దశరథం నృపమ్ ||

తా|| ఆవిధముగా వరమునిచ్చి , సకల ప్రాణులకు ఆధారమైన దేవ దేవుడైన శ్రీమహావిష్ణువు మానవలోకమున తానుఅ అవతరింపదగిన స్థానమును గురించి ఆలోచించెను. పిమ్మట ఆ రాజీవలోచనుడు తాను దశరథమహారాజునకు నాలుగు రూపములలో పుత్త్రులుగా జన్మించుటకు సంకల్పించెను.

తదా దేవర్షిగంధర్వాః సరుద్రాః సాప్సరోగణాః |
స్తుతిభిర్దివ్యరూపాభిః తుష్టువుర్మధుసూదనమ్ ||

తా|| అప్పుడు బ్రహ్మారుద్రాది దేవతలు , ఋషులు , గంధర్వులు, అప్సరసలు, దివ్యస్తుతులతో మధుసూదనుడు అగు శ్రీమహావిష్ణువును స్తుతించిరి.

త ముద్ధతం రావణముగ్ర తేజసం
ప్రవృద్ధ దర్పం త్రిదశేశ్వరద్విషమ్ |
విరావణం సాధు తపస్వికంటకం
తపస్వినాముద్దర తం భయావహమ్ ||

తా|| రావణుడు ఉగ్రమైన తేజస్సు కలవాడు , అతిగర్వముకలవాడు,ఇంద్రుని ద్వేషించువాడు, సాధువులను తపస్విలను హింసించువాడు,భయము కలగించువాడు, అట్టి దుష్టుని సంహరింపుము.

త మేవ హత్వా సబలం స బాంధవం
విరావణం రావణ ముగ్ర పౌరుషమ్ |
స్వర్లోకమాగచ్ఛ గచ్ఛ గతజ్వరశ్చిరం
సురేంద్రగుప్తం గతదోషకల్మషమ్ ||

తా|| అట్టి క్రూరుని , వాని బలములతో బాంధవులతో సంహరించి ఆర్తుల కష్తములను తొలగించి పిమ్మట ఓ దేవా ! రాగ ద్వేషములకు తావులేనిది అయిన స్వ లోకమునకు తిరిగిరమ్ము.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే పంచదశస్సర్గః ||
సమాప్తం ||


|| om tat sat ||